Back

Convenor Message

ప్రపంచవ్యాప్త తెలుగు కుటుంబానికి,

President

నమస్సుమాంజలి. ప్రపంచంలో అతి పెద్ద ప్రవాస తెలుగు సంఘమైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) స్థాపించి మే 28వ తారీఖు, 2017 నాటికి 40 వసంతాలు ముగుస్తాయి. అదే సమయంలో మే 26, 27, 28వ తారీఖులలో 21వ తానా ద్వైవార్షిక మహాసభలు సెయింట్‌ లూయిస్‌ నగరంలో జరుగబోతున్నాయి. ఈ బృహత్కార్యానికి నన్ను సమన్వయకర్తగా తానా అధ్యక్షులు, కార్యనిర్వాహక వర్గం ఎంపిక చేశారు. వారికి నా ధన్యవాదాలు.

ఈ మహాసభలను ‘ఎల్లలు లేని తెలుగు, ఎప్పటికీ వెలుగు’ ప్రధానాంశంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి పండుగగా జరుపుకోవాలని మా ఆకాంక్ష. మన తెలుగుభాష ప్రాచీనమైనది. మన తెలుగువారు మొదటి నుండి సాహసవంతులు, అన్వేషకులు. రెండు వేల సంవత్సరాల క్రితమే రోము దేశస్థులతో వాణిజ్యం చేశారన్న దాఖలాలు బంగారు రోమను నాణేల రూపంలో మన తెలుగు రాష్ట్రాలలో పలుచోట్ల లభ్యమయ్యాయి. తెలుగు ప్రజలు, పరిపాలకులు వందల సంవత్సరాలుగా యావత్‌ భారతదేశాన్నే కాక వివిధ రంగాల్లో యావత్‌ ప్రపంచాన్నే ప్రభావితం చేశారు, చేస్తున్నారు.

శౌర్యవంతులయిన రాజ్యాధినేతలు, కవిపండితులు, తత్త్వవేత్తలు, రాజకీయ దురంధరులు, స్వాతంత్య్ర సమరయోధులు, సంఘ సంస్కర్తలు, మరెందరో మహనీయులకి జన్మనిచ్చిన తల్లి మన తెలుగుతల్లి. నాడు-నేడు అన్ని రంగాల్లో విజేతలుగా నిలిచిన మనవారి వైభవం ప్రపంచవ్యాప్తంగా, నిరంతరంగా సాగిపోవాలనే మన ఈ మహాసభల ‘ఎల్లలు లేని తెలుగు, ఎప్పటికీ వెలుగు’ ప్రధానాంశం యొక్క ఉద్దేశ్యం.

ఇకపోతే మన 21వ తానా మహాసభల సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అంగరంగ వైభవంగా, పారదర్శకమైన వ్యవహారశౖలితో భారీ ఎత్తున జరపడానికి పనులు ప్రారంభించాము. కార్యవర్గాల సమీకరణ, నిధుల సేకరణ, ప్రముఖుల ఆహ్వానాలు వంటి పనులు చాలావరకు చేశాము. ఆటల పోటీలు, యువతీ యువకులకు ప్రత్యేక కార్యక్రమాలు, సాంస్కృతిక, వినోద, మహిళా, సాహిత్య, ఆధ్యాత్మిక కార్యక్రమాలు రూపొందించే ప్రయత్నాలు ఆయా సంబంధిత కార్యవర్గాలు వేగంగా సాగిస్తున్నాయి. పైన ఉదహరించిన రంగాల్లో ప్రముఖులతో పాటు తెలుగు రాష్ట్రాల రాజకీయ, సినీ ప్రముఖులతో, నగలు, చీరల దుకాణాలతో, నోరూరించే వంటకాలతో, చిన్నారుల నవ్వులతో, ఆత్మీయతలతో నిండిన స్నేహపూర్వక వాతావరణాన్ని మన తానాసభల వేదికగా కూర్చటమే మా లక్ష్యం. ఈ లక్ష్యాన్ని సాధించటానికి మీ అందరి అండదండలు, ఆశీస్సులే మా ఊపిరి.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎల్లలు లేని తెలుగు కుటుంబానికి అంతర్జాలముఖంగా ఇదే మా ఆహ్వానం. దయచేసి మీ అమూల్యమైన కాలాన్ని కొంత వెచ్చించి, మన సంస్కృతికి తార్కాణమైన ఈ తానా మహాసభలకి కుటుంబసమేతంగా పెద్దలు, పిల్లలు అందరూ విచ్చేసి ఈ సంబరాలకి ప్రాణం పోయమని మా ప్రార్థన.

జై తెలుగుతల్లి!
కూర్మనాధరావు చదలవాడ